కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో పేద ప్రజల పక్షాన నిలబడి, ఒకే జెండాను ఎజెండాను నమ్ముకుని నిరంతరం సేవ చేసిన నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. ఆదివారం సీపీఐ జాతీయ నాయకులు, మమత వైద్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పువ్వాడ ఫౌండేషన్ (Puvvada Foundation) ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వద్ద 88 మంది దివ్యాంగులకు రూ.3.52 లక్షల విలువైన కృత్రిమ పాదాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కృత్రిమ పాదాలను అందజేసిన మాజీ మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమర్థతతో జీవించాలనే ఉద్దేశంతో గత 15 ఏళ్లుగా ఈ పంపిణీ చేపడుతున్నామని, ఇప్పటివరకు 1,200 మందికి పైగా సహాయం అందించామని తెలిపారు. 1996లో ప్రారంభించిన మమత ఆసుపత్రి పేదల గుండెల్లో “జనతా ఆసుపత్రి”గా నిలిచిపోయిందని గుర్తుచేశారు. సేవా కార్యక్రమాలను ఒక రోజుకే పరిమితం చేయకుండా, ప్రజాసేవే పరమావధిగా తమ కుటుంబం నిరంతరం సమాజం కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

