కలం, కరీంనగర్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద విద్యార్థులకు (EWS Students) ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని వర్తింపజేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ లో ఓసీ జేఏసీ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో కలిసి రెవిన్యూ గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామారావు మాట్లాడుతూ.. విదేశీ విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 3,008 మంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కీమ్ కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.179.90 కోట్ల నిధులను విడుదల చేయడం హర్షణీయమన్నారు. అయితే, ఇదే పథకంలో ఈడబ్ల్యూఎస్ పేద విద్యార్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీ పేద విద్యార్థుల భవిష్యత్తుకు అన్యాయం చేయవద్దని కోరారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కూడా తక్షణమే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం కింద నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న ఓసీ జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రామారావు (OC JAC Leader Poladi Rama Rao) డిమాండ్ చేశారు. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఐదు వేల మందికి పైగా వీరులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు మత రాజకీయాల కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ మహోన్నత చరిత్రను విస్మరించడం తగదన్నారు. విముక్తి లేదా విలీనం పేరిట ఆ పోరాట స్ఫూర్తిని గుర్తించి, అధికారికంగా వేడుకలు నిర్వహించడంతో పాటు సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓసీ ఐకాస రాష్ట్ర నాయకులు అయిలేని మల్లికార్జున రెడ్డి, మిర్యాల ప్రసాదరావు, నలుమాసు ప్రభాకర్, మహంకాళి రాజన్న, కొత్త కొండ రవీందర్ రావులతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

