బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య విషాదాంతం

కలం, జగిత్యాల: రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన ఓ కార్యకర్త జీవితం అప్పుల భారంతో విషాదాంతమైంది. ఎండపల్లి మాజీ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ (Simhachalam Jagan) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణానికి ముందు ఆయన రాసినట్లు చెబుతున్న సందేశంలో రాజకీయ కార్యక్రమాల కోసం చేసిన ఖర్చులు, అప్పులు, ఈఎంఐల భారం, కుటుంబ భవిష్యత్తుపై ఆందోళనను వివరించారు. ‘‘నా పిల్లలు అనాథలు అవుతారు.. చిన్న పిల్లలు.. వారిని ఆదుకోండి’’ అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి హృదయాలను కలచివేస్తోంది. జగన్‌కు భార్య పల్లవితో పాటు కుమార్తె సంజన, కుమారుడు సుధాంష్‌ ఉన్నారు.

ఆర్‌ఎంపీ వైద్యుడి నుంచి రాజకీయాల్లోకి :

1998లో ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలు ప్రారంభించిన జగన్‌ 2001లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసి 2019లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అనంతరం మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాల కోసం నిరంతరం తిరగడం వల్ల తన ఆర్‌ఎంపీ ప్రాక్టీస్‌ తగ్గిపోయిందని, ఆదాయం తగ్గినా పార్టీ కార్యక్రమాల ఖర్చులు కొనసాగాయని ఆయన చివరి సందేశంలో పేర్కొన్నారు.

పెరిగిన అప్పులు.. ఈఎంఐల భారం :

2019 నుంచి 2022 వరకు పార్టీ బాధ్యతల్లో ఉన్న సమయంలో నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చయ్యేదని, ఈ మొత్తాలు అప్పులుగా మారి వడ్డీతో కలిపి సుమారు రూ.14 లక్షలకు చేరినట్లు తెలిపారు. అనంతరం ఇంటి రుణం, వ్యక్తిగత రుణాలు తదితర ఆర్థిక బాధ్యతలు పెరిగాయని పేర్కొన్నారు. 2024లో మరో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు, నెలవారీ ఈఎంఐలతో పాటు ఇతర అప్పులు తీర్చేందుకు పలువురి వద్ద రుణాలు చేయాల్సి వచ్చిందని వివరించారు. కుటుంబానికి చెందిన బంగారాన్ని సైతం తాకట్టు పెట్టినట్లు తన సందేశంలో పేర్కొన్నారు.

పిల్లల భవిష్యత్తుకు బరోసా కల్పించండి :

చివరి సందేశంలో బంధువులు, మిత్రులు, రాజకీయ సహచరులు, పార్టీ నాయకులు తన కుటుంబానికి అండగా నిలవాలని జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యకర్తల సంక్షేమంపై ప్రశ్నలు :

జగన్‌ విషాదం రాజకీయ పార్టీల్లో కార్యకర్తల పరిస్థితిపై మరోసారి చర్చకు దారితీసింది. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, ఎన్నికల సమయంలో కార్యకర్తలు తమ సమయం, శ్రమతో పాటు సొంత డబ్బును కూడా ఖర్చు చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే వారి ఆర్థిక స్థితి, కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు గురించి నాయకత్వం ఎంతవరకు ఆలోచిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కార్యకర్త కేవలం జనసమీకరణ కోసం ఉపయోగించే వ్యక్తి కాదని, అతనికీ కుటుంబం, బాధ్యతలు, భవిష్యత్తు ఉంటాయని రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచే సంక్షేమ వ్యవస్థలు, అత్యవసర సహాయ నిధులు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది.

జగన్‌ కుటుంబానికి ప్రస్తుతం సానుభూతి మాటలకంటే పిల్లల భవిష్యత్తుకు భరోసా, కుటుంబానికి ఆర్థిక అండ అవసరం. ఒక కార్యకర్త ప్రాణం కోల్పోయిన తర్వాత సానుభూతి ప్రకటించడం కంటే.. అతను కష్టాల్లో ఉన్నప్పుడే చేయూత అందించడం నిజమైన మానవత్వం. కార్యకర్తల శ్రమను గౌరవించడం అంటే వారి జీవితాలను, వారి కుటుంబాల భవిష్యత్తును కూడా గౌరవించడమే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>