కలం, మునుగోడు: భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం (Banda Srisailam) పిలుపునిచ్చారు. శనివారం సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా మునుగోడు (Munugode) మండలంలోని పలివెల గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే కొండవీటి గుర్నాథ్ రెడ్డి విగ్రహానికి, అమరవీరుల స్థూపాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిందన్నారు. నాటి యోధులు ప్రజల హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజలపై భారాలు మోపే విధానాలకు వ్యతిరేకంగా, రైతులు, కూలీలు, కార్మికులు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. సాయుధ రైతాంగ పోరాట చరిత్రను యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, వేముల లింగస్వామి, కట్ట లింగస్వామి, సీహెచ్ బిక్షం, పగిళ్ల మధు, పగిళ్ల యాదయ్య, పూల శీను, నరసింహ, కట్ట ఆంజనేయులు, సీహెచ్ శ్రీను, బల్లెం స్వామి, తదితరులు ఉన్నారు.

