కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రసంగం చేశారు. భారతదేశ అధ్యక్షత కాలంలో అందించిన సహకారానికి, మద్దతుకు బ్రిక్స్ నాయకులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే బ్రిక్స్ సభ్యదేశాలు అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పరస్పరం సహకారంతో బ్రిక్స్ దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపిన ప్రధాని.. ఏఐ, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో సహకారం అవసరం అని చెప్పుకొచ్చారు.
గ్లోబల్ రోడ్‌మ్యాప్‌పై మూడు సూత్రాలు
గ్లోబల్ రోడ్‌మ్యాప్‌పై మూడు సూత్రాలు అవలంభించాలని మోదీ సూచించారు. ప్రాతినిధ్యం, స్పందన, నియామాల రూపకల్పనపై దృష్టి సారించాలని కోరారు. తద్వారా బ్రిక్స్ (BRICS) సభ్యదేశాల ప్రజలకు భరోసా కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. అలాగే ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. యూఎన్ఎస్‌సీ సంస్కరణకు కాలపరిమితి ఉండాలన్న మోదీ.. యూఎన్ఎస్‌సీ చేపట్టే సంస్కరణలకు స్పష్టమైన ఫలితాలు రావాలని సూచించారు. నేటి వాస్తవాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలన్నారు.
అధికారం నుంచి భాగస్వామ్యానికి మారాలి
రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ వ్యవస్థలోని అధికారం, విశేషాధికారాల నిర్మాణాన్ని భాగస్వామ్య వేదికగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రపంచ పాలనా విధానంలో అవసరమైన సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్ణయ ప్రక్రియలో మరింత ప్రాధాన్యత లభించేలా అంతర్జాతీయ వ్యవస్థలో మార్పులు రావాలని సూచించారు.
నిర్ణయాల అమలుకు ప్రత్యేక యంత్రాంగం
బ్రిక్స్ కూటమి తీసుకునే నిర్ణయాలు, వాటి అమలు తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. కూటమి సంస్థాగత పురోగతి నిరంతరం కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలు అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పరస్పర గౌరవం, భాగస్వామ్యం, సహకారం ఆధారంగా బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రధాని (PM Modi) ఆకాంక్షించారు.
Also Read : అసెంబ్లీకి వెళ్లకుండా సీఎం కుట్ర: సబితా ఇంద్రారెడ్డి
Follow Us On: X(Twitter)

