కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించనున్నారు. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు నగరం పరిధిలోని పలు కీలక మార్గాల్లో వాహనాల మళ్లింపులు అమలులో ఉండనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ దారి మళ్లింపులను చేపట్టనున్నారు. వివి విగ్రహం, పాత సైఫాబాద్ పిఎస్, మింట్ కాంపౌండ్, రాజ్‌దూత్ లేన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు.
నగరవాసులు, భక్తులు రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలు, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ వసతులను కూడా ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ వేడుకలు..
భక్తుల జయజయధ్వానాలు, బాణసంచా కాల్పుల నడుమ ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ వేడుకలు వైభవంగా జరిగాయి. 72 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఉత్సవాల్లో ఈ ఏడాది లంబోదరుడు ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి విగ్రహానికి ఒకవైపు ఏర్పాటు చేసిన సోమనాథ్ జ్యోతిర్లింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మనోహర ఘట్టాన్ని తిలకించేందుకు నగర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

