కలం, నిర్మల్: నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా (Women Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం
బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగామణి, లక్ష్మి, కమల, విజయ, రుక్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.

