కలం, వెబ్ డెస్క్: రామంతాపూర్ (Ramanthapur) పాలిటెక్నిక్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవో నెం.97 రద్దు చేయాలని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు చేసిన ఆందోళనలో తోపులాటకు దారి తీసింది. వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా బయటకు రావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో.. బలవంతంగా లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కొందరు విద్యార్థులు కింద పడిపోయారు. చివరికి, వారిని సముదాయించి కాలేజీలోకి పంపించారు.
జీవో రద్దు చేయాల్సిందే..
ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడుతూ.. జీవో నెం.97 కారణంగా తాము ఇంజినీరింగ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ఇంజినీరింగ్ చదవాలంటే మళ్లీ ఇంటర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది తమ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

