కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే 22A భూములకు సంబంధించిన అంశంపై తక్షణమే చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే, ఈ వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. ఛైర్మన్ నిర్ణయానికి నిరసనగా BRS ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ (BRS Walkout) చేశారు.
‘జై తెలంగాణ’ నినాదాలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం
అయితే నిరసనల్లో భాగంగా సభలో బీఆర్ఎస్ సభ్యులు పదేపదే ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్లమెంట్‌లో జై తెలంగాణ అని నినదించి తెలంగాణ సాధించాం. ఇంకా ఎందుకు జై తెలంగాణ అంటున్నారు?’’ అని మండిపడ్డారు. సభ సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించాలని, నిరసనల పేరుతో సభా కాలాన్ని వృథా చేయవద్దని ఛైర్మన్ హితవు పలికారు.

