కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. స్వర్ణాంధ్ర విజన్ – 2047 లక్ష్యాల సాధనే అజెండాగా జరుగుతున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రియాక్టివ్ అధికారులు కాదు.. ప్రో యాక్టివ్ అధికారులు కావాలని సూచించారు. తాను ఒక్కడినే పనిచేస్తే కాదు.. అందరూ పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఫైల్స్ పెండింగ్ పెట్టారంటే.. అభివృద్ధి పెండింగ్‌లో పెట్టినట్టేనని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా గత వైసీపీ పాలన పై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. గత వైసీపీ పాలనలో తీసుకొచ్చిన J బ్రాండ్ మద్యం వల్ల రాష్ట్రంలో 30వేల మంది చనిపోయారని మండిపడ్డారు. ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చామని అన్నారు. కచ్చితమైన వేగవంతమైన చర్యలతో వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసుకున్నామని కలెక్టర్లకు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

