కాజీపేటకు నాలుగో లైన్‌.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

కలం, వరంగల్ బ్యూరో: రైలు ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేట (Kazipet) నాలుగో లైన్‌ కల సాకారం అయ్యే దశలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌–వరంగల్‌ రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన ఘట్కేసర్–కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ.2,419 కోట్లతో నాలుగో లైన్..

దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా 9 రాష్ట్రాల్లో చేపట్టనున్న మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కలిపి రూ.20,804 కోట్ల పెట్టుబడికి ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కాజీపేట నాలుగో లైన్ నిర్మాణానికి రూ.2,419 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 17 ప్రధాన వంతెనలు, 151 చిన్న వంతెనలు ఉండనున్నాయి.

ఈ లైన్ పూర్తయితే మేడ్చల్–మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ జిల్లాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. నాలుగేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌ నుంచి కాజీపేట వరకు ఇప్పటికే ఉన్న రైల్వే మార్గానికి అదనపు ట్రాక్‌ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల రైళ్లతోపాటు గూడ్స్‌ రైళ్ల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఏర్పడనుంది.

భూసేకరణ ప్రక్రియకు కదలిక..

కాజీపేటకు నాలుగో లైన్‌ అంశం కొత్తది కాదు. బల్హార్షా–కాజీపేట–విజయవాడ–గూడూరు మధ్య 744.80 కి.మీ. నాలుగో లైన్‌ ప్రాజెక్టును మార్చి 2026లోనే కేంద్రం ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటించి భూ సేకరణకు మార్గం సుగమం చేసింది. ఇందులో తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి.

అదే విధంగా యాదాద్రి–కాజీపేట మధ్య 77.96 కిలో మీటర్ల మేర మూడో, నాలుగో లైన్లు, ఘట్‌కేసర్‌–యాదాద్రి మధ్య 32.45 కిలో మీటర్ నాలుగో లైన్‌ కోసం కూడా ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా నోటిఫికేషన్‌ జారీ అయింది. జులైలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అధికారుల నియామక ప్రక్రియ కూడా జరిగింది.

కాజీపేట మరింత బలోపేతం..

తెలంగాణలో కీలక రైల్వే హబ్‌గా కాజీపేట స్థానం మరింత బలోపేతం కానుంది. కాజీపేట నాలుగో లైన్‌ విస్తరణకు సంబంధించి గతంలోనే బల్హార్షా–కాజీపేట–విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్‌ భూసేకరణ ప్రక్రియ కూడా వివిధ దశల్లో కొనసాగుతోంది. ఘట్‌కేసర్‌–యాదాద్రి, యాదాద్రి–కాజీపేట మార్గాల్లో అదనపు లైన్ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్‌–కాజీపేట రైల్వే కారిడార్‌ సామర్థ్యం మరింత పెరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>