కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను (Land re-survey process) వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ (Collector Hemanta Keshav Patil) అధికారులను ఆదేశించారు. బుధవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను, గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనుల పురోగతిని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. చెన్నారం గ్రామంలో మొత్తం 76 సర్వే నంబర్ల పరిధిలో 847 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నట్లు, ఇందులో 147 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఏడీ ల్యాండ్ సర్వే గిరిధర్ కలెక్టర్‌కు వివరించారు.
ప్రభుత్వ, అటవీ భూములపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ భూములకు సంబంధించిన రీ-సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, రైతులకు సంబంధించిన భూముల రీ-సర్వే పనులను నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతూ కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 70 గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రీ-సర్వే ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించిన అనంతరం మాత్రమే ఆన్లైన్లో నమోదు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా పరిశీలించి, భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
పాఠశాలలో విద్యా ప్రమాణాలపై కలెక్టర్ ఆరా
భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు అవకాశం లేకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న పుస్తకాలను విద్యార్థులకు వినియోగంలోకి ఎందుకు తీసుకురావడం లేదని కలెక్టర్ హెడ్ మాస్టర్‌ను ప్రశ్నించారు. పుస్తకాలు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి
పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని సూచించారు. గ్రామ పర్యటన సందర్భంగా గ్రామ సర్పంచ్ హేమలత గ్రామంలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించిన కలెక్టర్, గ్రామపంచాయతీ నిధుల నుంచి అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామస్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏడీ ల్యాండ్ సర్వే గిరిధర్, తహశీల్దార్ సైదులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామ సర్పంచ్ ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.

