కలం, కరీంనగర్: నగరంలోని రేకుర్తి 19వ డివిజన్‌లో బుధవారం ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ విగ్రహానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల జీవితాలను, వారి భావోద్వేగాలను, భాషా యాసను తన రచనల ద్వారా ఎలుగెత్తి చాటిన మహోన్నత ప్రజాకవి అని కొనియాడారు. తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని, తెలంగాణ యాసలోని ప్రత్యేకతను తన సాహిత్యంతో ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కాళోజీ అని అన్నారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, ప్రజా సమస్యలపై తన కలం ద్వారా నిరంతరం పోరాడిన కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని కొలగాని పేర్కొన్నారు. కాళోజీ ఆలోచనలు, రచనలు, ప్రజాస్వామ్య విలువలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాళోజీ వంటి మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్, కాళోజీ నగర్ కాలనీల అధ్యక్షులు రమణారెడ్డి, నారాయణరెడ్డితో పాటు పలువురు డివిజన్ నాయకులు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.

