కలం, నేషనల్ డెస్క్ : లగ్జరీ లైఫ్ స్టైల్, భారీ ఖర్చులకు కేరాఫ్ అడ్రస్‌గా.. దేశంలో ఇన్నాళ్లూ ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి మెగా నగరాలే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు సీన్ మారుతున్నది. డైమండ్ సిటీ సూరత్ (Surat).. సైలెంట్‌గా మెట్రో నగరాలకు సవాల్ విసురుతున్నది. ‘ది మెనీ అర్బన్ ఇండియాస్’ నివేదిక ప్రకారం.. దేశంలోని సంప్రదాయ ‘బిగ్ సిక్స్’ మెగా సిటీలను పక్కనపెడితే.. అతిపెద్ద కన్జంప్షన్ మార్కెట్‌గా సూరత్ రికార్డు సృష్టించింది. పారిశ్రామికంగా ఎంతో ముందంజలో ఉన్న పుణె (28 బిలియన్ డాలర్లు), అహ్మదాబాద్ వంటి ప్రముఖ నగరాలను వెనక్కినెట్టి.. ఏకంగా 34 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.85 లక్షల కోట్లు) వార్షిక మార్కెట్తో కొత్త స్పెండింగ్ హబ్‌గా సూరత్ అవతరించింది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 19 నగరాల్లో సూరత్(Surat)ను నంబర్ వన్ ‘బూమ్టౌన్’గా తాజా నివేదిక గుర్తించింది. సూరత్‌లోని ఒక సగటు కుటుంబం చేసే ఖర్చు.. ఐటీ హబ్ బెంగళూరులోని కుటుంబం కంటే ఎక్కువగా ఉంది. ఇక సంపాదన విషయానికి వస్తే.. హైదరాబాద్, చెన్నై, కోల్ కతా వంటి మహానగరాల కంటే సూరత్ సగటు గృహ ఆదాయం చాలా ఎక్కువ కావడం విశేషం. ఇక్కడి టెక్స్ టైల్ బిజినెస్, డైమండ్ ట్రేడింగ్ స్థానికులను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుండటమే ఇందుకు కారణం.
వీకెండ్ వస్తే మరింత ఖర్చు
వ్యాపారవేత్తల ఎదుగుదలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజల ఆదాయాలు పెరగడం నగర వినియోగ శక్తిని భారీగా పెంచింది. ఆదాయం పెరుగుతున్న కొద్దీ కార్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు ఇక్కడ భారీగా పెరుగుతున్నాయి. వీకెండ్ వస్తే సూరత్ మరింత ఖర్చు చేస్తున్నది. శని, ఆదివారాల్లో ఇక్కడి ప్రజలు సాధారణ రోజుల కంటే ఏకంగా 2.44 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. వీకెండ్స్ విలాసాల్లో జైపూర్ (2.76 రెట్లు) తర్వాత సూరత్ రెండో స్థానంలో నిలిచింది.
ఖర్చుల్లో ‘కింగ్’.. పొదుపులో ‘గ్రేట్’
విలాసాల కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నప్పటికీ, సూరత్ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం లేదని తాజా నివేదిక వెల్లడించింది. మెట్రో నగరాల్లో సగటున 18.5% డెట్-టు-ఇన్కమ్ (అప్పు-ఆదాయం) నిష్పత్తి ఉండగా, సూరత్ లో అది కేవలం 15.4% మాత్రమే కావడం గమనార్హం. సంపాదన, ఖర్చుల మధ్య అద్భుతమైన సమతుల్యతను పాటిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలు, అత్యవసర పరిస్థితుల కోసం ఈ నగరంలో దాదాపు 92 శాతం కుటుంబాలు క్రమం తప్పకుండా డబ్బును పొదుపు చేస్తున్నాయి.
ఆ100 నగరాలదే హవా
దేశవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న టాప్-100 నగరాలు కలిపి ఏకంగా 844 బిలియన్ డాలర్ల (రూ.74.5 లక్షల కోట్లు) వార్షిక వినియోగాన్ని నమోదు చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. దేశ జనాభాలో ఐదో వంతు కంటే తక్కువ మంది నివసించే ఈ నగరాలే, దేశం మొత్తం మీద జరిగే జాతీయ వినియోగంలో దాదాపు మూడో వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఈ నగరాల్లో గృహాల ఖర్చులు ఏటా 10.4% వేగంతో పెరుగుతుండగా.. దేశ సగటు వృద్ధి మాత్రం 8.5% గానే ఉంది.
Also Read : ఇంత అవమానమా?: సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా మురళీధర్‌రావు!
Follow Us On : WhatsApp

