కలం, హనుమకొండ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసినట్లు పేర్కొంటున్న అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సుబేదారి పోలీస్ స్టేషన్లో(Subedari Police Station) ఫిర్యాదు చేశారు. మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. కేసీఆర్ చనిపోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించారని ఆరోపించిన బీఆర్ఎస్ నాయకులు, ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, రాజకీయ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమేనని, అయితే మాజీ ముఖ్యమంత్రి, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిపై వ్యక్తిగతంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదన్నారు. కేసీఆర్‌ను అభిమానించే తెలంగాణ ప్రజల మనోభావాలను ఎమ్మెల్యే వ్యాఖ్యలు దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని, వ్యక్తిగత దూషణలకు, ప్రాణహాని కోరుకునే విధమైన వ్యాఖ్యలకు తావు ఉండకూడదని అన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన వ్యాఖ్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వర్తించే చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని సుబేదారి పోలీసులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ రాజకీయ విమర్శలను ఎవరూ తప్పుపట్టరని, అయితే వ్యక్తిగతంగా దూషిస్తూ ఒక నాయకుడు చనిపోవాలని కోరుకునే స్థాయిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు.
కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని అనుచిత వ్యాఖ్యలతో తగ్గించలేరని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ సంస్కృతిని కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, ఇమ్మడి లోహిత రాజు, బీఆర్ఎస్ నాయకులు పోలేపల్లి రామ్మూర్తి, తక్కెళ్లపల్లి వినీల్ రావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

