కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం (Sadasivpet Accident )సిద్ధాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. సదాశివపేటకు చెందిన టైటస్ అనే విద్యార్థి సదాశివపేటలోని జీనియస్ స్కూల్‌లో చదువుతున్నాడు. కాగా, రోజూలాగే పాఠశాల ముగిసిన తర్వాత అన్న టైటస్‌ను ఇంటికి తీసుకురావడానికి అతని తమ్ముడు ఎఫ్రాయిమ్ కుటుంబ సభ్యులతో కలసి బస్సు పాయింట్ వద్దకు వెళ్లాడు.
టైటస్ బస్సు దిగిన అనంతరం, డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో వెనుక చక్రాలు ఎఫ్రాయిమ్ పైకి ఎక్కాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఎఫ్రాయిమ్ సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

