కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి (Erravalli) గ్రామం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునివ్వడంతో రోజంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించి, ఫామ్‌హౌస్‌కు వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేశారు.
పోటాపోటీ నిరసనలకు పిలుపు
అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎస్సీ కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాలు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. సుమారు 500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఫామ్‌హౌస్‌కు వచ్చే అన్ని మార్గాల్లో బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్‌కు మద్దతుగా మర్కూక్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లి వైపు తరలివచ్చేందుకు ప్రయత్నించారు.
పోలీసుల ఆంక్షలు.. కార్యకర్తల దూకుడు
144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు ఎర్రవల్లి వైపు చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు కార్యకర్తలు పోలీసులను తప్పించుకుని స్థానిక రైతుల పంట పొలాల గుండా ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తల ముట్టడి యత్నాలతో తమ పంట పొలాల్లోకి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరదరాజ్‌పూర్, దామరకుంటలో ఘర్షణలు
వరదరాజ్‌పూర్, దామరకుంట గ్రామాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కారు అద్దాలు ధ్వంసం చేయడం, కర్రలతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ కార్యకర్తల కారణంగా తమ గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంక్షలపై స్థానికుల అసహనం
కేసీఆర్ ఫామ్‌హౌస్ కేంద్రంగా తరచూ రాజకీయ కార్యక్రమాలు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు, సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఫామ్‌హౌస్ ముట్టడి లేదా నిరసనలకు పిలుపునిచ్చిన ప్రతిసారీ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సొంత గ్రామాలకు, పంట పొలాలకు వెళ్లే వారితో పాటు అత్యవసర పనులపై వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుని విచారిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండే తమ గ్రామాలు రాజకీయ ఆందోళనల కారణంగా రణరంగాన్ని తలపించే పరిస్థితులకు చేరుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్‌లో ఎటువైపు దారితీస్తాయోనని మర్కూక్ మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

