భద్రాద్రి ఎయిర్‌పోర్ట్ రేసులో మణుగూరు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు స్థల ఎంపికలో కొత్తగా మణుగూరు ప్రాంతం (Manuguru) రేసులోకి వచ్చింది. గతంలో అనుకున్న కొన్ని ప్రాంతాలు సాంకేతిక కారణాలతో వేర్వేరు సవాళ్లను ఎదుర్కొనడంతో, ఈసారి ప్రత్యామ్నాయంగా మణుగూరుతో పాటు కొత్తగూడెం పరిసర ప్రాంతాలపై ఏవీఎస్ (AVS) ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం ప్రధానంగా దృష్టి సారించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది.

​హైదరాబాద్, ఢిల్లీల నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం మణుగూరు, కొత్తగూడెం పరిసరాల్లో విస్తృతంగా పర్యటించింది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన రన్‌వే అనుకూలత, భౌగోళిక వాతావరణ పరిస్థితులు, భూభాగ స్వభావం, గాలి దిశ, విజిబిలిటీతో పాటు భూసేకరణ సాధ్యాసాధ్యాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మణుగూరు ప్రాంతాన్ని కొత్తగూడెం పరిసరాలతో పోల్చి చూస్తూ, ఏ ప్రాంతం సాంకేతికంగా అత్యంత అనుకూలంగా ఉందో నిపుణులు అధ్యయనం చేశారు.

​మరోవైపు ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో సమావేశమయ్యారు. దక్షిణ అయోధ్యాగా పేరుగాంచిన భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే భక్తులతో పాటు సింగరేణి, కేటీపీఎస్ వంటి భారీ పరిశ్రమలకు విమానాశ్రయ కనెక్టివిటీ ఎంతో అత్యవసరమని మంత్రి తుమ్మల వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, సాంకేతిక బృందం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ​క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన దృష్ట్యా ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సాంకేతిక నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నివేదిక సానుకూలంగా వస్తే భద్రాద్రి జిల్లా వాసుల దశాబ్దాల విమానాశ్రయ కల నెరవేరుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>