కరీంనగర్‌ పోలీస్ స్టేషన్ నుంచే పెట్రోలింగ్ వాహనం చోరీ

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో దొంగలు విజృంభిస్తున్నారు. వరుస చోరీలతో స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న దుండగులు, తాజాగా ఏకంగా పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్నే ఓ వ్యక్తి ఎత్తుకెళ్లడం (Police Vehicle Stolen) స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ​

సమస్య పరిష్కారం కోసం స్టేషన్‌కు వచ్చి..

కుటుంబ సమస్య పరిష్కారం కోసం స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి, ఏకంగా పోలీస్ పెట్రోల్ వాహనాన్నే ఎత్తుకెళ్లి పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపాడు.​ కరీంనగర్‌కు చెందిన ఇజాజ్ అనే వ్యక్తి మత్తుకు బానిసయ్యాడు. తన కుటుంబ సమస్యను పరిష్కరించి, భార్యను తీసుకురావాలంటూ సోమవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అంతకుముందు ఇదే విషయంపై పలుమార్లు ‘డయల్ 100’కు కూడా కాల్స్ చేశాడు. ​రాత్రి 11:30 గంటల సమయంలో స్టేషన్ ఆవరణలోనే ఉన్న ఇజాజ్, అక్కడ పార్క్ చేసి ఉన్న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్నోవా (పెట్రో కార్)లో కీస్ ఉండటాన్ని గమనించాడు. సమయం చూసి వాహనాన్ని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసుల అప్రమత్తత.. హైవే ఛేజింగ్

​పోలీస్ వాహనం మాయమైందని గుర్తించిన వెంటనే ఏసీపీ విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డిలు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనం వరంగల్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే హుజురాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లతో పాటు నేషనల్ హైవే టోల్ గేట్ల సిబ్బందిని అలర్ట్ చేశారు.

ఊహించని ప్రమాదం

​మానకొండూరు మీదుగా నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు, ఎల్కతుర్తి దాటిన తర్వాత రోడ్డు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో అదుపుతప్పి కిందకు జారిపడింది. ప్రమాదం తీవ్రంగా జరిగినప్పటికీ కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఇజాజ్‌కు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం నుంచి బయటపడిన ఇజాజ్ రోడ్డుపైకి వచ్చి, ప్రయాణించే ఇతర వాహనదారులకు సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. వాహనంలో ఉన్న కీలకమైన పోలీస్ వైర్‌లెస్ సెట్‌ను ఇజాజ్ బయట పడేసినట్లు సమాచారం. ​

అదుపులోకి నిందితుడు

సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదానికి గురైన ఇన్నోవా వాహనాన్ని క్రేన్ సహాయంతో కరీంనగర్‌కు తరలించి, నిందితుడు ఇజాజ్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>