NHM నియామకంలో అక్రమాలు.. ​విచారించాలని డీఆర్వోకు కలెక్టర్ ఆదేశం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద జారీ చేసిన నోటిఫికేషన్‌ (NHM Recruitment)లో  తీవ్ర అక్రమాలు జరిగాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) నాయకులు డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందిన అభ్యర్థిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల్లోంచి తొలగించాలన్నారు. ​ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేత, బాధితుడు నగేష్‌లతో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన కలెక్టర్.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి (DRO)ను ఆదేశించారు.

నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు..

​ఈ సందర్భంగా ఏఐఎఫ్బీ నాయకులు మాట్లాడుతూ.. 27/02/2024 నోటిఫికేషన్ ప్రకారం డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పోస్టు భర్తీలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. జాప లత (తండ్రి: గోపాల్‌రెడ్డి) అనే అభ్యర్థి UGC, DEB గుర్తింపు లేని బోగస్ డిగ్రీ పత్రాలతో దరఖాస్తు చేసినప్పటికీ, అధికారుల అండదండలతో ఆ పోస్టును ఆమెకు కేటాయించారని తెలిపారు. నకిలీ పత్రాలతో ఉద్యోగం సాధించిన జాప లతను తక్షణమే విధి నిర్వహణ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి పొందిన జీతభత్యాల మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు. భోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన అభ్యర్థిపై, ఈ అక్రమానికి సహకరించిన నాటి DMHO, సీనియర్ అసిస్టెంట్ పండుపై ‘చీటింగ్’ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

అర్హత ఉన్నవారికి కేటాయించాలి.. ​

ఈ అక్రమ నియామకాన్ని రద్దు చేసి, నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం తదుపరి అర్హత (మెరిట్) ఉన్న అభ్యర్థికి ఉద్యోగం కేటాయించాలని కోరారు. ​UGC/DEB గుర్తింపు లేకుండా, ప్రాంతీయ పరిధి దాటి పొందిన దూరవిద్య డిగ్రీలు ప్రభుత్వ నియామకాలకు చెల్లవని సుప్రీం కోర్టు (UGC vs Annamalai University), రాష్ట్ర హైకోర్టు తీర్పులు ఇచ్చాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పొందిన డిగ్రీలకు ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>