కలం, నేషనల్ డెస్క్ : ఇజ్రాయెల్‌పై మరో భారీ దాడికి ఇరాన్ (Iran) సన్నాహాలు చేస్తున్నది. తన మద్దతుదారులు (ప్రాక్సీలు) అయిన ప్రాంతీయ సాయుధ ముఠాలను ఏకం చేసి 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి కంటే అతిపెద్ద స్థాయిలో ‘మల్టీ-ఫ్రంట్’ రణరంగాన్ని సృష్టించేందుకు వ్యూహం రచిస్తున్నది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల ఆధారంగా జెరూసలేం పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’గా పిలిచే కూటమిని ఇరాన్ రంగంలోకి దించుతున్నది. లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌కు చెందిన హౌతీలు, హమాస్‌తో పాటు ఇరాక్, సిరియాలోని ఇరాన్ అనుకూల ముఠాలన్నింటినీ కలిపి ఇజ్రాయెల్‌పై ఒకేసారి ఏకధాటిగా దాడికి దింపాలని ప్రణాళికలు వేసింది.
క్యూడ్స్ ఫోర్స్ రంగప్రవేశం
అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన సమయంలో ఇరాన్‌కు గానీ, హెజ్బొల్లాకు గానీ ముందస్తు సమాచారం లేదు. ఆ సమయంలో హెజ్బొల్లా కేవలం చిన్నపాటి దాడులకే పరిమితమైంది. ఈసారి ఆ సమన్వయ లోపాన్ని సవరించుకుని మొదటి రోజు నుంచే అన్ని సరిహద్దుల నుంచి ఒకేసారి విరుచుకుపడేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కి చెందిన ‘క్యూడ్స్ ఫోర్స్’ సీనియర్ అధికారులు ఈ కూటమికి సారథ్యం వహిస్తున్నారు. హెజ్బొల్లా, హౌతీ, ఇరాక్ ముఠాల కమాండర్లతో నిరంతరం సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, ఉమ్మడి సైనిక శిక్షణను కూడా ప్రారంభించారు.
సైనిక బలగాల పునరుద్ధరణ
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న తమ మిలిటరీ సామర్థ్యాన్ని ఇరాన్ వేగంగా పునరుద్ధరించుకుంటున్నది. ఉత్తరాన ఉన్న హెజ్బొల్లా, దక్షిణాన ఉన్న హమాస్.. ఇరువైపుల నుంచి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చేలా ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) తమ నిఘా వర్గాల ద్వారా గుర్తించింది.
సిన్వార్ సీక్రెట్ డాక్యుమెంట్లు బయటపెట్టిన రహస్యాలు
కాగా, గాజాలో హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వార్‌కు చెందిన రహస్య పత్రాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకుంది. అక్టోబర్ 7 దాడితో ఇజ్రాయెల్‌లో గందరగోళం సృష్టించి.. ఇరాన్, హెజ్బొల్లాలు తక్షణమే పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగేలా ఒత్తిడి తేవచ్చని సిన్వార్ అంచనా వేశారు. హెజ్బొల్లా వద్ద వేల సంఖ్యలో గైడెడ్ మిస్సైళ్లు, డ్రోన్లు ఉన్నాయి.
Also Read : అన్నదమ్ములను కలిపిన ‘సర్’
Follow Us On : WhatsApp

