సర్ పేరుతో ఓట్ల తొలగింపు.. తడి గుడ్డతో గొంతు కోయడమే: రేవంత్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ‘సర్’ పేరుతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే భారీ కుట్ర జరుగుతుందని, తడి గుడ్డతో గొంతులు కోసే చర్యలకు బీజేపీ పాల్పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘాటుగా విమర్శించారు. శనివారం కొడంగల్ (Kodangal) సీఎం నివాసంలో స్థానిక కార్యకర్తలు, నాయకులు మాట్లాడారు. కొడంగల్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు ఈ గుర్తింపు, గౌరవం వచ్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ‘సర్’ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందనీ, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారన్నారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనూ అలాగే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందనీ, తెలంగాణలో దొంగదెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకునేవారు లేరన్నారు.

ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరనీ, మీ పప్పులు ఉడకనీయరని సీఎం తెలిపారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని భారీ కుట్రకు బీజేపీ పాల్పడుతుందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. గతంలో ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారనీ, కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని సీఎం విమర్శించారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి బీజేపీ పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ కుట్రకు బీఆర్ఎస్ కూడా బీజేపీకి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.

ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది, ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉందని ఆయన గుర్తు చేశారు. గ్రామాల వారీగా బీఎల్ఏ లను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరు 4 గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకునే విధంగా పని విభజన జరగాలన్నారు. ప్రతీ బూత్ లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత పడాలన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలనీ, బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను గమనిస్తూ ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>