కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నడుస్తున్న కొండా సురేఖ (Konda Surekha) వివాదం ఎట్టకేలకు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ చర్చల తరువాత ఏఐసీసీ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన సిఫారసును ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు పంపించింది.
అయితే, కొండా సురేఖ (Konda Surekha) పదవిపై తొలగింపుపై ఊహాగానాలు ప్రారంభమైన నాటి నుంచి తాను బీసీ రాగం ఎత్తుకున్నారు. పద్మాశాలి, మున్నూరు కాపు అంటూ కులాల ప్రస్తావన తీసుకువచ్చారు. తాను పద్మశాలినని, తన భర్త కొండా మురళి (Konda Murali) మున్నూరుకాపు అంటూ మాట్లాడారు. మహిళ, బీసీ అంటూ కొండా సురేఖ స్ట్రాటజీ తీసుకురాగా.. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కౌంటర్ ఇచ్చారు.
కొండా సురేఖ బర్తరఫ్ తో బీసీ వర్గంతో పాటు మహిళల నుంచి వ్యతిరేకత రాకూడదని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని తొలగించడంతో ఆయన స్థానంలో గద్వాల విజయ లక్ష్మిని నియమించారు. గద్వాల విజయ లక్ష్మి మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో అటు ఆ సామాజిక వర్గంతో పాటు మహిళ కావడంతో ఒకే దెబ్బకు రెండు పిట్లలు అనే విధంగా రేవంత్ సర్కార్ ఆమెకు పదవిచ్చిందనే చర్చనడుస్తోంది.
అలాగే, తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల విజయలక్ష్మి స్థానంలో నేరెళ్ల శారదను నియమించింది. మరోవైపు ‘కుడా'(కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్ పర్సన్ గా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గుండు సుధారాణిని నియామకానికి రేవంత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ముగ్గురు బీసీ మహిళలకు పదవులు..
గద్వాల విజయ లక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణి.. ఈ ముగ్గురు మహిళలు బీసీ సామాజికవర్గానికే చెందిన వారు కావడం విశేషం. వీరి నియామకంపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందనే చెప్పాలి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో వచ్చే వ్యతిరేకతను ముగ్గురు మహిళలకు కీలక పదవులు కేటాయించడం ద్వారా తగ్గించే అవకాశం లేకపోలేదు. వీరి నియామకంతో కొండా సురేఖ వేసిన ‘బీసీ, మహిళ’ అస్త్రంపై రేవంత్ రెడ్డి బ్రహ్మాస్త్రం ప్రయోగించారనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ
Follow Us On : WhatsApp

