ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం తగదు: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఎంపీ ల్యాడ్స్ నిధులను (MPLADS Funds) వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు వెనుకబడిపోతున్నారంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సత్యదూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. పనుల పురోగతిని పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం, వారి గౌరవాన్ని తగ్గించేలా ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. తమ నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై పూర్తి గణాంకాలతో కూడిన వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు.

ఆ పనులు వివిధ దశల్లో ఉన్నాయి..

18వ లోక్‌సభకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.17.50 కోట్లు కేటాయించగా, అందులో ఇప్పటికే రూ.16.47 కోట్లు (94.1 శాతం) నిధులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రజా విజ్ఞప్తుల మేరకు కమ్యూనిటీ హాల్స్, బోర్ వెల్స్, హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం మొత్తం 627 ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపడం జరిగిందన్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా నుండి 313, రాజన్న సిరిసిల్ల నుండి 151, సిద్దిపేట నుండి 79, జగిత్యాల నుండి 45, మరియు హన్మకొండ నుండి 39 పనులు ఉన్నాయి. వీటిలో 82.29 శాతం పనులకు కలెక్టర్లు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

నా వద్ద నిధులేమి మిగల్లేదు..

16వ లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ తన కాలంలో ఖర్చు చేయకుండా వదిలేసిన రూ.2.5 కోట్ల నిధులను సైతం తానే వినియోగించి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 7 నెలల సమయం ఉన్నప్పటికీ తన వద్ద ఎంపీ ల్యాడ్స్ నిధులేమీ మిగల్లేదని, నిధులన్నీ వినియోగించామని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ నిధులు సరిపోవడం లేదని, నిధులు పెంచాలని ఎప్పటి నుండో కోరుతున్నామని పేర్కొన్నారు.

సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నాం..

ఎంపీ నిధులు చాలక సీఎస్ఆర్ (CSR) నిధులను కూడా సేకరించి ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రతిపాదనల పంపడం, కలెక్టర్ల ఆమోదం, అధికారుల కార్యాచరణ వంటి దశలను విస్మరించి ఏకపక్షంగా నివేదికలు ఇవ్వడం సరికాదని బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ ఇకనైనా వాస్తవాలను, పనుల దశలవారీ పురోగతిని పరిగణనలోకి తీసుకుని సమాచారాన్ని బయటపెట్టాలని సూచించారు.

Also Read : కాంగ్రెస్ ఉచిత ఉల్లిగడ్డల పంపిణీ.. ఎగబడిన జనం, చివరకు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>