విద్యార్థులకు చదువుతో పాటు ఇది కూడా నేర్పించాలి: కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట : డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును సక్రమంగా పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) అన్నారు. సోమవారం నారాయణపేట (Narayanpet) జిల్లా కేంద్రంలోని ఎర్ర గుట్ట వద్ద గల గురుకుల బాలికల పాఠశాలలో స్వతః పాండేషన్ సౌజన్యంతో జిల్లాలోని ఎంఈవో, హెచ్ఎంలకు ఫైనాన్స్ లిటరసీ, మనీ మంత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్ననాటి నుంచే డబ్బు వినియోగం, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ ప్రియాంక అన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి జిల్లాలోని 88 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఎంపిక కావడం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా గొప్ప అవకాశమన్నారు. సరైన విధంగా పెట్టుబడి పెట్టడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం అంతకంటే ముఖ్యమని తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియా, టెక్నాలజీ ద్వారా త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆకర్షణీయమైన ప్రకటనలు, తప్పుడు పెట్టుబడి పద్ధతులు విద్యార్థులు, యువతను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అత్యాశకు లోనై ఆర్థికంగా నష్టపోయి, సమస్యలను ఎదుర్కొంటున్న ఘటనలు మనం చూస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు విద్యార్థులకు ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

12వ తరగతి వరకు చాలామంది విద్యార్థులు స్వయంగా పెద్ద మొత్తంలో డబ్బును నిర్వహించే అవకాశం ఉండదని, భవిష్యత్తులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చినప్పుడు దానిని ఎలా సక్రమంగా వినియోగించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు తమ రెగ్యులర్ డే ప్లాన్, సబ్జెక్ట్ ప్లాన్‌లతో పాటు ఫైనాన్షియల్ లిటరసీకి కూడా ప్రత్యేక సమయం కేటాయించాలని కలెక్టర్ సూచించారు.

హెడ్‌మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే భాషలో రూపొందించిన పుస్తకాలు, బోధనా సామగ్రి వెనుక ఎంతోమంది కృషి ఉందని, వాటిని విద్యార్థులకు నాణ్యమైన రీతిలో అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులో పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించినప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం ఏ విధంగా అమలవుతుందో పరిశీలిస్తానని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>