హుస్నాబాద్‌ను సంపూర్ణ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి పొన్నం

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గాన్ని విద్యా రంగంలో అగ్రగామిగా నిలిపి, సంపూర్ణ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలుర, బాలికల నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి రూ. 7.28 కోట్ల చొప్పున, మొత్తం రూ. 14.56 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక భవనాలను నిర్మిస్తున్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, అలాగే సైదాపూర్‌లో మరో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

భీమదేవరపల్లి మండలంలో నవోదయ విద్యాలయం, చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాబోతున్నాయన్నారు. సాంకేతిక విద్య కోసం ఇప్పటికే Advanced Technology Centre (ATC) నిర్మాణానికి శంకుస్థాపన పూర్తి కాగా, ఎల్కతుర్తిలో బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT) బ్రాంచ్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. విద్యా రంగంతో పాటు హుస్నాబాద్‌ను క్రీడల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కబడ్డీ అకాడమీతో పాటు, స్పోర్ట్స్ స్టేడియంను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే నాణ్యమైన విద్యను అభ్యసించాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని, భవిష్యత్తులో ఉత్తమ ర్యాంకులు సాధించి, ఉద్యోగ, ప్లేస్‌మెంట్ అవకాశాలను సొంతం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అకడమిక్, విద్యా బోధన విషయంలో ఏ చిన్న లోటు పాట్లు ఉన్నా దానికి వైస్ ఛాన్స్‌లర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఎడ్యుకేషన్ గార్డియన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>