లిప్ బామ్ వాడినా పెదాలు పగులుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి!

కలం, వెబ్ డెస్క్: సాధారణంగా చలికాలంలో పెదాలు పగలడం, పొడిబారడం (Dry Lips) అనేది సర్వసాధారణ సమస్య. లేదా వాతావరణం మారినా పెదాలు పగలడం సర్వసాధారణం. కానీ కొంత మందికి కాలంతో, వాతావరణంతో సంబంధం లేకుండా పెదాలు పగులుతుంటాయి. దీనికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అయితే పొడిబారే పెదాలను సహజసిద్ధమైన ఇంటి చిట్కాలతో సులువుగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో సాధారణ చర్మానికి సహజ సిద్ధమైన నూనె ఉత్పత్తి చేసే గ్రంధులు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎప్పుడూ మృదువుగా ఉంచుతాయి. కానీ పెదాలపై ఈ గ్రంథులు ఉండవు. అందుకే అవి తర్వగా తేమను కోల్పోయి పొడిబారుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెదాలు పగలడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి

  • వాతావరణంలో వచ్చే మార్పులు పెదాలు పగలడానికి ముఖ్యం కారణమట. చల్లటి, పొడి గాలులకు పెదాలు త్వరగా తేమను కోల్పోతాయట.
  • పదే పదే పెదాలను నాలుకతో తడపడం వల్ల కూడా పెదాలు పగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
  • ధూమపానం చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందట.
  • తగినంత నీరు తాగకపోవడం
  • శరీరంలో విటమిన్ B2, B6, ఐరన్ లోపించడం
  • ఘాటైన రసాయనాలు ఉన్న లిప్ స్టిక్స్, టూత్ పేస్ట్ వాడటం

పై కారణాల వల్ల పెదాలు తరచుగా పగిలే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెదాలు ఆరోగ్యంగా ఉండేందుకు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెదాలు పగలకుండా ఉండాలంటే శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. దీని కోసం ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. అంతే కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు.. కీరదోస, నారింజ, పుచ్చకాయ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవడం అవసరం. ఆకుకూరలు, గుడ్లు, గింజలు రెగ్యులర్ గా తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, జింక్, ఐరన్ వంటి పోషకాలు అందుతాయి.

పగిలిన పెదాలను మృదువుగా మార్చడంలో కొబ్బరి నూనె, బాదం నూనె అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఈ నూనె రాసుకోవడం వలన పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు స్వచ్ఛమైన నెయ్యి లేదా షియా బట్టర్ రాసుకోవడం వల్ల కూడా పెదాల పగుళ్లు త్వరగా తగ్గిపోవడంతో పాటు సహజమైన రంగు తిరిగి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

పెదాలకు సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసే మరో పదార్థం తేనె. పెదాలపై కొద్దిగా తేనే రాసుకోవడం వలన ఇన్ఫెక్షన్లు దరిచేరవని చెబుతున్నారు. అంతే కాకుండా చక్కెర, ఆలివ్ నూనె లేదా తేనె కలిపి సున్నితంగా మసాజ్ చేయడం వలన పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటించడంతో పాటు కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలి. అవే.. పెదాలను పంటితో కొరకడం, నాలుకతో తడపడం వంటి అలవాట్లు మానుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు నాణ్యమైన లిప్ బామ్ వాడటం, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం వలన పెదాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>