కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ క్రీడా రంగంలో చారిత్రాత్మక ముందడుగు పడింది. ప్రపంచస్థాయి క్రీడా ప్రతిభకు పేరుగాంచిన కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (KNSU)తో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ మేరకు తన గత దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా KNSU అధ్యక్షుడు మూన్ వోన్ జేతో పాటు ఉన్నత ప్రతినిధి బృందంతో సమావేశమై ఒప్పందం చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ యువ క్రీడాకారులకు అథ్లెట్ శిక్షణ, క్రీడా విజ్ఞానం, అత్యున్నత క్రీడా విద్యలో ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకమైన వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పారిస్ ఒలింపిక్స్ లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలు KNSUలో శిక్షణ పొందిన అథ్లెట్ల ద్వారా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదే స్థాయి క్రీడా సంస్కృతిని తెలంగాణకు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల నుంచి ఒలింపిక్ వేదిక వరకు యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు. భారత్ 2036 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ నుంచి దేశానికి గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేయడమే తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు.

