కలం, పెద్దపల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (MLA Vijaya Ramana Rao) పిలుపునిచ్చారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లో కోచ్ బొల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్ఎన్ఆర్ టేబుల్ టెన్నిస్, చెస్ స్పోర్ట్స్ అకాడమీ’ని మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలలో క్రీడలపై ఆసక్తిని పెంచి, వారిలోని ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తారని తెలిపారు. సుల్తానాబాద్‌లో టేబుల్ టెన్నిస్, చెస్ క్రీడలకు ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అకాడమీ ద్వారా స్థానిక క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి అకాడమీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సత్తా చాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడం అజయ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బాయి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, క్రీడా శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

