కలం, నిర్మల్: మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసి, ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొందరు పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని.. ‘చేతి’ని నరకాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం సీఎల్పీలో బొజ్జు పటేల్ మాట్లాడారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ అభిప్రాయాలేనని విమర్శించారు.
గతంలోనూ పలుమార్లు ఆరోపణలు చేసినా.. కూతురు వ్యాఖ్యలను తల్లిగా సురేఖ ఎందుకు ఖండించలేదని వెడ్మ బొజ్జు పటేల్ ప్రశ్నించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని రాజీనామా చేయాలని చెబుతున్న సుస్మిత.. ముందు తన తల్లితో ఆ పని చేయించాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ, రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విన్నవించారు.

