తెలంగాణ హక్కులపై తుమ్మల.. విలీన పంచాయతీలపై విజ్ఞప్తులు

కలం, ఖమ్మం బ్యూరో: ​సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం వేదికగా తెలంగాణ హక్కులు, సరిహద్దు ప్రాంతాల సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తనదైన ముద్ర వేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి గురువారం ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక అంశాలపై విజ్ఞప్తులు చేశారు.

​రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రాచలం పరిసర ఐదు గ్రామ పంచాయతీలను, తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విలీనం చేయాలని కోరారు. ఈ భౌగోళిక వ్యత్యాసం వల్ల గిరిజనులు తీవ్ర పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, నక్సల్స్ నిరోధక భద్రతా చర్యల సమన్వయానికి కూడా ఈ గ్రామాల విలీనం అవసరమని స్పష్టం చేశారు.

​ఇక సాగునీరు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. 2024 జూలైలో దెబ్బతిన్న అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టులో 85.25 శాతం (13,640 ఎకరాలు) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నందున, ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఆయిల్‌పామ్ గెలల టన్ను ధరను రూ.25,000గా నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడిగా ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. దీనితో పాటు, NH-30, NH-16 లని అనుసంధానిస్తూ భద్రాచలం నుంచి ఏలూరు వరకు ఉన్న 160–165 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర రహదారికి జాతీయ రహదారి హోదా కల్పించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>