శక్తి స్కీమ్, జీవో-97 రద్దు చేయాలి.. గద్వాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

కలం, జోగులాంబ గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల‌ మండలం గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు (Gadwal Polytechnic Students) భారీ ఆందోళన చేపట్టారు. గురువారం బీఆర్ఎస్ నాయకులు కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

“శక్తి డౌన్.. డౌన్”, “జీవో-97 రద్దు చేయాలి”, “పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి” అంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్ యూ)లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

శక్తి శాఖ ఏర్పాటుచేసి అందులో ఐటీఐ, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లను విలీనం చేయడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని విద్యార్థులు అన్నారు. కొత్త స్కీం పేరుతో ప్రభుత్వ సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విద్యార్థులు మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శక్తి స్కీం, జీవో నెం 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు‌ చోటు చేసుకోకుండా గద్వాల సీఐ టి. శ్రీను ఆధ్వర్యంలో గద్వాల టౌన్ ఎస్ఐ కల్యాణ్ కుమార్, గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్ఐ శ్రీహరి, ‌ట్రాపిక్ ఎస్ఐ బాలచంద్రుడు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>