కలం, వెబ్డెస్క్: తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ (Southern Zonal Council) సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి మినహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి తమిళనాడు సీఎం విజయ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి అంతర్రాష్ట్ర అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల మధ్య సాగునీటి పంపకాల్లో వివాదాలు, ప్రాజెక్టు నిర్మాణాలపై పరస్పరం అభ్యంతరాలు ఉండడంతో వీటి పరిష్కారం కోసం వాటిని ఎజెండాలో పేర్కొన్నాయి. మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగినప్పుడు కోర్టు విచారణలు గరిష్టంగా రెండు నెలల్లోనే పూర్తికావడం, దానికి వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయడం అనే అంశాన్ని కేంద్ర హోంశాఖ ఈ సమావేశంలో ప్రస్తావించనున్నది.

