గజ్వేల్‌లో ఉచిత వైద్యానికి ‘ప్రైవేట్’ బ్రేక్!

క‌లం, మెద‌క్ బ్యూరో: గ‌జ్వేల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ (Gajwel Hospital)లో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న ధీమాతో వస్తున్న నిరుపేదలకు అక్కడి పరిస్థితులు ప్రైవేటు హాస్పిట‌ల్ను త‌ల‌పిస్తున్నాయి. రోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సిన కొందరు హాస్పిటల్ సిబ్బంది దళారులతో కుమ్మక్కై ప్రైవేట్ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ నడుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆసుపత్రిలోనే పూర్తిస్థాయి వైద్య పరీక్షల సదుపాయాలు ఉన్నప్పటికీ, కావాలనే రోగులను ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తూ ఫీజుల భారం మోపుతున్నారు. రోగాన్ని నయం చేస్తారనే భరోసాతో వచ్చిన రోగులు దోపిడీకి బలవుతున్నారు. సర్కార్ వైద్యం సరిగా అందించకపోతుండంతో ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నారు. గ‌జ్వేల్ ప్రభుత్వ ఆసుప‌త్రి డాక్ల‌ర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైద్య సిబ్బంది పేదలను నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు.

ఇది ఏ స్థాయిలో జ‌రుగుతుందంటే ఇటీవల మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి.. నిర్వహణ, డెవలప్‌మెంట్ ఫండ్స్ వినియోగం, సిబ్బంది వ్యవహారంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల ఏజెంట్లు ఎందుకు వస్తున్నారనే దానిపైనా ఎంపీ తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ సీఎం ఇలాకాలోనే..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఉన్నప్రాంతం. మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇక్క‌డి నుండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్క‌డ ఏ ఘ‌ట‌న జ‌రిగినా కానీ, రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చనీయాంశమవుతుంది. అలాంటి గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరిస్థితులపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

నిరుపేదలకు ఉచితంగా అందాల్సిన సేవలను అందించకుండా ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లకు రోగులను రెఫర్ చేస్తున్నారని తీవ్ర విమ‌ర్శలు వస్తున్నాయి. వంద ప‌డ‌కల ప్ర‌భుత్వ ఆస్పత్రితో పాటు, మరో వంద ప‌డ‌క‌ల మాత శిశు సంర‌క్ష‌ణ కేంద్రంలో ప‌లు ర‌కాల వైద్య సేవ‌లు, ల్యాబ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పట్టికీ వైద్య పరీక్షల కోసం బయటకు పంపిస్తున్నారని రోగులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప‌రీక్ష‌ల పేరుతో నిలువుదోపిడీ

అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిరుపేదలు నిత్యం వందల్లో వ‌స్తుంటారు. గర్భిణులు, బాలింతలు, సాధారణ రోగులు, క్యాన్సర్‌, పక్షవాతం, శస్త్ర చికిత్సలకు సంబంధించిన సేవలు అందుతున్నాయి. ఎంసీహెచ్, జనరల్ ఆసుపత్రుల్లో పలు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ కావాలనే కొన్ని పరీక్షలను ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వైద్య సిబ్బంది రెఫర్ చేస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా గ‌ర్భిణులకు సంబంధించిన అల్ట్రాసౌండ్, టీఫా, గ్రోత్ స్కానింగ్, ఎక్స్‌రే, ఈసీజీ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన ల్యాబ్ లు ఆసుపత్రిలో ఉన్న‌ప్ప‌టికి ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు చెందిన ఏజెంట్లు ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో కుమ్మక్కై రోగులను తమ వైపు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కమీషన్లు తీసుకుంటూ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని రోగుల‌ను, గ‌ర్భిణులను ప‌లుర‌కాల ప‌రీక్ష‌లకు ప్రైవేటు ల్యాబ్స్ కు పంపుతున్నారు. డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధుల‌ను నిర్ధారించే కిట్లు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో, రోగ నిర్ధార‌ణ కోసం రోగులు ప్రైవేటు ల్యాబ్ ల‌ను ఆశ్రయిస్తున్నారు. రోగులు అత్య‌వ‌స‌రంగా స్కానింగ్ తీసుకోవాల్సి వ‌స్తే బ‌య‌ట‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేద‌ల‌కు రూ. వేలల్లో ఖర్చులు భరించే పరిస్థితులు ఉన్నాయి. చివరకు ఆసుపత్రిలోని మార్చురీ వ‌ద్ద కూడా వ‌సూళ్లు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఏళ్లుగా తిష్టవేసి చేతివాటం

ఆసుప‌త్రిపై ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవడంతో డాక్ట‌ర్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న కొందరు సిబ్బందిపై చేతివాటం పెరిగింద‌ని, వారు స్థానికంగా ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకులతో కలిసి మాఫీయాగా మారి రోగులను దోచుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వ‌స్తున్నాయి. బదిలీ నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు ఇక్కడే తిష్ట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ఆసుప్ర‌తిలోని డాక్ట‌ర్లు కొర‌త ఉండ‌టంతో పాటు ఉన్నకొంద‌రు సైతం విధుల్లో నిర్ల‌క్ష్యంగా ఉంటున్నారు. ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రి ఆవ‌ర‌ణ‌లో రూ. కోట్లలో ఖర్చు చేసి 20 ఇండ్లను డాక్టర్లు, స్టాఫ్ ఉండడానికి నిర్మించిన భవనాల్లో ఒక్కరు కూడా ఉండడం లేదు. దీంతో ఆయా భవనాలు సైతం నిరుపయోగంగా ఉంటున్నాయి. గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు అందాల్సిన మెరుగైన‌ వైద్యం వైద్య సిబ్బంది తీరుతో అందడంలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>