కలం, స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో (BWF World Championships) భారత్‌కు బుధవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్లు పీవీ సింధు, ఆయుష్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ, తనిషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ రౌండ్ ఆఫ్ 16కు చేరుకోగా, లక్ష్యసేన్, ఉనతి హుడా, హరిహరన్ అమ్సకరుణన్-ఎంఆర్ అర్జున్ జోడీలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు అమెరికాకు చెందిన 18 ఏళ్ల గారెట్ టాన్ భారీ షాక్ ఇచ్చాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 21-19తో గెలిచిన లక్ష్య, తర్వాతి రెండు గేమ్‌లలో టాన్ పోరాటానికి తలవంచాడు. 19-21, 21-17 స్కోర్లతో మిగిలిన రెండు గేమ్‌లను గెలిచిన టాన్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని లక్ష్యను టోర్నీ నుంచి బయటకు పంపించాడు.
మరోవైపు యువ సంచలనం ఆయుష్ శెట్టి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. శ్రీలంకకు చెందిన దుమిందు అబేవిక్రమపై 21-18, 21-10తో సునాయాస విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అంతకుముందు ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని ఓడించిన ఆయుష్ అదే జోరును కొనసాగించాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కెనడాకు చెందిన వెన్ యూ జాంగ్‌పై 21-16, 21-17తో వరుస గేమ్‌లలో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి స్కాట్లాండ్ ఆటగాళ్లు అలెగ్జాండర్ డన్, ఆడమ్ ప్రింగిల్ మ్యాచ్‌కు ముందే వైదొలగడంతో వాకోవర్ లభించింది.
మిక్స్డ్ డబుల్స్‌లో తనిషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ మకావు జోడీపై 21-11, 21-11తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. అయితే మహిళల సింగిల్స్‌లో ఉనతి హుడా నిరాశపరిచింది. తొలి గేమ్ గెలిచినా కెనడాకు చెందిన మిషెల్ లీ చేతిలో 21-11, 9-21, 21-23తో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో హరిహరన్ అమ్సకరుణన్-ఎంఆర్ అర్జున్ జోడీ కొరియా జోడీ కాంగ్ మిన్ హ్యూక్-కి డాంగ్ జూ చేతిలో 17-21, 14-21తో ఓడి టోర్నీకి వీడ్కోలు పలికింది. మొత్తంగా భారత్ తరఫున సింధు, ఆయుష్, సాత్విక్-చిరాగ్, తనిషా-ధ్రువ్ జోడీలు ముందంజ వేయగా, లక్ష్యసేన్ నిష్క్రమణ భారత అభిమానులను నిరాశపరిచింది.

