చిన్నా vs మేఘా.. వనపర్తి కాంగ్రెస్‌లో రాజుకుంటున్న రచ్చ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో (Wanaparthy Congress) అంతర్గత పోరు మరోసారి భగ్గుమంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై సోమవారం స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డికి సవాల్ విసిరారు. డబ్బులు ఎవరికిచ్చానో చిన్నారెడ్డి నిరూపించాలని, పార్టీ సర్వేల ఆధారంగానే తనకు టికెట్ వచ్చిందని కౌంటర్ చెప్పారు.

మరో “జీవన్ రెడ్డి”లా..

వనపర్తిలో ముదురుతున్న ‘చిన్న’ – ‘మేఘా’ పోరుతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా, ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో తిప్పికొట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి (Chinna Reddy) ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మేఘారెడ్డి డబ్బులు వెదజల్లి, అధిష్టానాన్ని మభ్యపెట్టి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మేఘారెడ్డి అవినీతిమయం చేశారని మండిపడ్డారు. తన వర్గం కార్యకర్తలను, తన పనులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓపిక నశిస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను మరో “జీవన్ రెడ్డి”లా (తిరుగుబాటు నేతగా) మారాల్సి వస్తుందని సొంత పార్టీనే హెచ్చరించారు.

ఆరోపణలను ఖండించిన మేఘారెడ్డి..

తాను డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నానన్న ఆరోపణలను ఎమ్మెల్యే మేఘారెడ్డి (Tudi Megha Reddy) ఖండించారు. ఎవరికి, ఎప్పుడు డబ్బులిచ్చానో చిన్నారెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన సర్వేల్లో తన గెలుపు అవకాశాలు ఉండటం వల్లే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమికి పనిచేశారని, సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేశారని ఎదురుదాడి చేశారు.

మరోసారి రచ్చకెక్కిన వివాదం..

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ చిన్నారెడ్డికి, బీఆర్ఎస్ నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్న మేఘారెడ్డికి మధ్య అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. అధిష్టానం చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం పదవినిచ్చి బుజ్జగించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు చల్లారలేదు. తాజా వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి రచ్చకెక్కింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>