కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ డెయిరీ (Karimnagar Dairy) ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) అన్నారు. ప్రైవేట్ డెయిరీలకు మేలు చేసేందుకు కరీంనగర్ డెయిరీని నిర్వీర్యం చేసే ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది పాల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. పద్మనగర్ నుంచి శాంతియుత పాదయాత్రగా కరీంనగర్ కలెక్టరేట్ వరకు ఉమ్మడి జిల్లా పాడి రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పోలాడి రామారావు మాట్లాడుతూ.. 1989కి ముందు కరీంనగర్ మిల్క్ ఫెడరేషన్ 11 ఎకరాల విస్తీర్ణంలో, పరిమిత యంత్రాలు, కొద్దిమంది ఉద్యోగులతో ప్రభుత్వ జోక్యంతో కొనసాగేదన్నారు. అప్పట్లో రోజుకు 20 వేల లీటర్ల పాల ఉత్పత్తితో రూ.1.30 కోట్ల నష్టాల్లో ఉండేదని తెలిపారు.
1989లో రైతుల భాగస్వామ్యంతో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్ సొసైటీగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ జోక్యం లేకుండా రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 లక్షల లీటర్ల పాల సేకరణతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోందని పేర్కొన్నారు. సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది మంది పాడి రైతులకు డెయిరీ ద్వారా ప్రయోజనం కలుగుతోందని రామారావు తెలిపారు. జిల్లాలోని దేవాలయాలు, పాఠశాలలకు కరీంనగర్ డెయిరీ నెయ్యి, పాలు సరఫరా చేస్తోందని, కొత్త మార్కెట్లను విస్తరించుకుంటూ లాభాల బాటలో కొనసాగుతోందని అన్నారు.
ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం ధరణిలో కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న 11 ఎకరాల భూమిని అధికారులు తొలగించి, కొత్తగా ఏర్పాటైన భూ మాత పోర్టల్‌లో ఇతర వివరాలతో నమోదు చేశారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ నెల 5న కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ డెయిరీకి సంబంధించిన ఆస్తులను పాత ఫెడరేషన్‌కు మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం కరీంనగర్ డెయిరీని నాశనం చేసి ప్రైవేట్ సంస్థలకు మేలు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. త్వరలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు గన్ను నర్సింహారెడ్డి, ఆకారపు గౌతమ్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాల్వ వెంకట్, మహేష్, నరేష్, మల్లయ్య, వెంకటయ్య, తీగల లక్ష్మణ్ రావుతో పాటు ఉమ్మడి జిల్లా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

