కలం, నాగర్ కర్నూల్: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్లు తప్పనిసరిగా డ్రాఫ్ట్ జాబితాను పరిశీలించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ (Nagarkurnool SIR) తెలిపారు. జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 910 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల వివరాలిలా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026 జూన్ 10 నాటికి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 880 పోలింగ్ కేంద్రాల్లో 7,31,632 మంది ఓటర్లు నమోదై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణతో వాటి సంఖ్య 910కి పెరిగిందని, ఆగస్టు 17న విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,18,592 మంది ఓటర్లు ఉన్నట్లు, 3,11,395 మంది పురుష ఓటర్లు, 3,07,182 మంది మహిళా ఓటర్లు, 15 మంది ఇతరులు, 579 సర్వీస్ ఓటర్లు ఉన్నాయని తెలిపారు.
ఎస్‌ఐఆర్ సందర్భంగా 22,669 మంది ఓటర్లు మరణించినట్లు బీఎల్‌ఓల క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించి అధికారికంగా నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే 18,260 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదని, మరో 20,396 మంది ఓటర్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు లేదా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ ఓటు నమోదును మార్చుకున్నట్లు పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై 2026 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
కలెక్టర్ కీలక సూచనలు..
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై వచ్చే క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించిన అనంతరం 2026 అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఓటరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, పేరు మాత్రమే కాకుండా ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, లింగం, చిరునామా తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు.
కుటుంబంలోని అర్హులైన ప్రతి సభ్యుడి పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అర్హత ఉన్నప్పటికీ పేరు లేకపోతే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హమైన లేదా నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ఓటర్ల వివరాలను గుర్తించి సరిచేయడమే ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, పారదర్శకత, విశ్వసనీయతను పెంచే విధంగా సవరణ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవి కుమార్, ఎన్నికల డిటీ కల్పన, భారతీయ జనతా పార్టీ తరపున నాగేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తరపున, ఎండి హబీబ్, రాజేందర్, చింతల రాజ్ గోపాల్, వైసీపీ నుండి ఎండి హుస్సేన్, టీడీపీ నుండి డి బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నరసింహ, విష్ణు, సిపిఎం పార్టీ తరఫున పర్వతాలు, అశోక్, తదితరులు ఉన్నారు.

