కలం, వెబ్ డెస్క్: సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్టుగా ఉందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన TIMS ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారం చేసుకుంటోందని ఫైర్ అయ్యారు.
డేట్లు, డెడ్‌లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్న ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమని హరీశ్ రావు విమర్శించారు. వెయ్యి కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. పేరు మార్చినంత సులువుగా చరిత్ర మార్చలేరని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
ప్రచారంపై ఉన్న శ్రద్ధ వైద్యంపై లేదు..
2022 ఏప్రిల్ 26న ఒకేరోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు తమ అధినేత కేసీఆర్ శంకుస్థాపన చేసి వాటి నిర్మాణానికి రూ. 2, 678 కోట్లు మంజూరు చేశారని హరీశ్ రావు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా సాగిన టీమ్స్ ఆసుపత్రలు పనులు.. కాంగ్రెస్ అధికారంలోకి నత్తనడకన సాగినట్లు ఆరోపించారు. మూడున్నరేళ్ల సుదీర్ఘ కాలంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండా, కేవలం ప్రచారం కోసం నేడు TIMS సనత్‌నగర్‌ను ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. కనీసం ఆసుపత్రికి నీటి సరఫరా కూడా కల్పించలేదు అంటే పేదల వైద్యం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థం అవుతుందని సెటైర్ వేశారు.
ఈ సందర్భంగా ప్రచారంపై ఉన్న శ్రద్ధ, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంపై ఎందుకు లేదు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన TIMS, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ, 2000 పడకల నిమ్స్ కొత్త ఆసుపత్రుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

