కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS) ఇటీవల విడుదల చేసిన అంగన్‌వాడీ ఉద్యోగ ప్రకటన నిరుద్యోగ మహిళల్లో గందరగోళం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 178 అంగన్‌వాడీ టీచర్, 878 ఆయా పోస్టులు మొత్తం 1,056 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపిక ప్రక్రియ చుట్టూ ముసురుకున్న అస్పష్టత అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, నిబంధనలలోని లోపాలు పెద్ద చిక్కుముడిగా మారాయి.
సాధారణంగా అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాల్లో పట్టణాల్లో సంబంధిత వార్డును, గ్రామీణ ప్రాంతాల్లో సదరు కేంద్రం ఉన్న గ్రామపంచాయతీని ‘స్థానికత’గా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అయితే, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నిబంధనేవివాదానికి దారితీసింది. గిరిజన తండాలు ఉన్న కేంద్రాలకు సంబంధిత ఆవాసానికి (Habitation) చెందిన ఎస్టీ మహిళలే అర్హులని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఏజెన్సీ పరిధిలోని జనరల్ లేదా ఓపెన్ పోస్టుల నియామకంలో స్థానికతను గ్రామపంచాయతీగా తీసుకోవాలో లేక అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ఆవాస ప్రాంతంగా పరిగణించాలో మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొనలేదు. నోటిఫికేషన్ నిబంధనల్లో ఏజన్సీ గిరిజనేతరులు అనే అంశంపై ప్రత్యేక మినహాయింపులు లేకపోవడంతో, తాము అర్హులమో కాదో తెలియక వందలాది మంది గిరిజనేతర మహిళలు అయోమయంలో పడ్డారు.
ఇక ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకపోవడం, కేవలం ఇంటర్మీడియట్ మార్కులు, ఇంటర్వ్యూ ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేపట్టడంపై నిరసన వ్యక్తమవుతోంది. తుది ఎంపికలో ఇంటర్వ్యూ మార్కులే కీలకం కానున్నప్పటికీ, ఈ ముఖాముఖిలో కనీస మార్కులు ఉంటాయా లేదా అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. పారదర్శకమైన రాత పరీక్ష లేకపోవడం, ఇంటర్వ్యూ నిర్వహణపై నిశ్శబ్దం వహించడం వల్ల ఈ నియామకాలు అక్రమాలకు, రాజకీయ నాయకుల సిఫార్సులకు దారితీస్తాయని స్థానికులు మేధావులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నియామకాలు పూర్తి కావాలంటే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని జనరల్ పోస్టులకు సంబంధించి స్థానికత నిబంధనపై పబ్లిక్ నోటీస్ ద్వారా అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇంటర్వ్యూ మార్కుల కేటాయింపు ప్రక్రియను పారదర్శకం చేసి మెరిట్ జాబితాలను బహిరంగంగా ప్రదర్శించాలి. జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.
ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరగాలి – వేర్పుల నరేశ్, మణుగూరు
అంగన్‌వాడీ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరగాలి. యూపీఎస్సీ, టీజీపీఎస్సీల మాదిరిగా అటెండ్ అయిన ప్రతి అభ్యర్థికి మినిమం మార్క్స్ ఇవ్వాలి. ఆలాగే గిరిజనేతరుల్లో స్థానికతపై గందరగోళ సమస్య నెలకొంది. మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడం వల్ల అవినీతికి ఆస్కారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

