కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా మధిర – వైరా రహదారి (Madhira–Wyra Road) పై మంగళవారం ఉదయం దారుణ దృశ్యం వెలుగుచూసింది. పీవీఆర్ ఏసీ కల్యాణ మంటపం సమీపంలో ఒక వ్యక్తి రక్తపు మడుగులో శవమై పడి ఉండడం తీవ్ర కలకలానికి దారితీసింది. మృతుడి తలపై లోతైన గాయాలు ఉండడంతో, ఎవరో ఉద్దేశపూర్వకంగానే అతనిపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
మృతదేహం లభ్యమైన ప్రదేశంలో వర్షపు నీరు నిలిచి ఉన్న చిన్న గుంత ఉండడం, రక్తం నీటిలో కలవడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పట్టణ ఎస్సై షాయినేని సవిత చౌదరి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుడిని వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా? లేక పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కారణంగా ఈ దాడి జరిగిందా? అనే విభిన్న కోణాల్లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కేసులోని కీలక ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు.

