కలం, స్పోర్ట్స్ : మైదానంలో ఆట ఆడుతుండగానే పిడుగు పడింది (Lightning Strike). ఊహించని ఈ ప్రమాదంలో యంగ్ ఫుట్‌బాలర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దక్షిణ థాయిలాండ్‌లో జరిగిన ఈ ఘోర ఉదంతం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం స్థానిక అమచ్యూర్ టోర్నమెంట్ ‘గోలోక్ ఎఫ్ఏ కప్’ నిర్వహించారు. ఇందులో భాగంగా ‘సామ్‌కోల్ట్స్’, ‘అబు x నోంగ్ సిరిన్’ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. భారీ వర్షంలోనే ఆటగాళ్లు మైదానంలో బంతి వెంట పరిగెడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద శబ్దంతో మైదానంలో పిడుగు పడింది . సామ్‌కోల్ట్స్ జట్టు వింగర్, 24 ఏళ్ల సోఫ్వాన్ అవే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
మిగతా ఆటగాళ్లు వెంటనే అతని వద్దకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని కాపాడేందుకు శ్రమించారు. తీవ్ర గాయాల కారణంగా సోఫ్వాన్ అవే మృతి చెందినట్లు పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడంతో క్రీడాభిమానులు నివ్వెరపోయారు. వర్షం, ఉరుములు ఉన్న సమయంలో మ్యాచ్‌ను ఎందుకు నిలిపివేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. థాయిలాండ్‌లో పిడుగుపాట్లు సాధారణమని ‘ది ఇండిపెండెంట్’ పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య దేశంలో 283 మంది పిడుగుపాటుకు గురయ్యారని డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆటగాడి అకాల మరణం పట్ల థాయిలాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. మృతుని కుటుంబానికి, క్లబ్ ప్రతినిధులకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఖేదకరమైన ఘటనలపై మున్ముందు భద్రతా నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
SAD NEWS💔💔
Lightning Kills a Football player in Thailand 💔💔 pic.twitter.com/po0o931iMG— Bleach _ N United ♥️🇳🇬🇵🇹 💀 (@bleach_n_united) August 6, 2026

