కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజులలో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వర్షాధార, తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్ (VP Gautham) అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన, మిషన్ భగీరథ, ప్రణాళిక శాఖ అధికారులతో ఎల్‌నినో పరిస్థితులు, కంటింజెన్సీ ప్రణాళిక, వర్షపాతం, పంటల సాగు, నీటి లభ్యతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం, వర్షపాతం పరిస్థితులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 3.91 లక్షల ఎకరాలలో సాగు జరగగా, ఈ ఏడాది సుమారు 3.09 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి, పత్తి సాగుపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు వివరించారు. కంది వంటి తక్కువ నీటి అవసరమున్న పంటల సాగు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా వి.పి. గౌతమ్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం ఒక్క ఏడాదికే పరిమితం కాదని, దీర్ఘకాలిక ప్రణాళికతో రైతులను తక్కువ నీటి అవసరమున్న పంటల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్, ఉద్యానవన పథకాల కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలను రైతులకు అందించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని తెలిపారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో జలాశయాలలో నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 0.6 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యంగా వినియోగించాలని స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నాయనే ఆశతో రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేయవద్దని సూచించారు. సాగునీటి విడుదలపై తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు. తాగునీటి అవసరాలను కాపాడటం ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, రైతులకు వాస్తవ పరిస్థితులను ముందుగానే తెలియజేస్తే భవిష్యత్ సమస్యలను నివారించవచ్చని వి.పి. గౌతమ్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్‌ఓ ఎ. నిర్మల, ఆర్‌డీఓ నవీన్, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

