కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను కచ్చితత్వంతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి (CEO Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, పుట్టినతేదీలో వ్యత్యాసాలు, లింగ నమోదులో తప్పులు, సంతకాల లోపాలను గుర్తించి సరిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ పురోగతిపై సోమవారం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు, డిజిటైజేషన్ పురోగతి, ఓటరు జాబితా సవరణలపై సమీక్షించారు. గైర్హాజరైన, నివాసం మార్చుకున్న, మరణించిన, నకిలీ ఓటర్లకు సంబంధించిన ఏఎస్‌డీడీ జాబితాలు, నో మ్యాపింగ్ కేసులు, వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. లోపాలు గుర్తించిన సందర్భాల్లో రోల్‌బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి రికార్డులను పునఃపరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని సూచించారు.
క్షేత్రస్థాయి ధ్రువీకరణ తప్పనిసరి
బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ లెవల్ సూపర్ వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు) క్షేత్రస్థాయి ధ్రువీకరణను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్టు తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల మినిట్స్‌ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) సంతకాలతో సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎన్నికలు) శాఖ అదనపు కార్యదర్శి ఎన్ శంకర్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి (ఎఫ్‌ఏసీ) జీఎస్ చారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల డీఈఓలు, ఈఆర్‌ఓలు, నోడల్ అధికారులు, సెక్షన్ అధికారులు, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

