కలం, ఖమ్మం బ్యూరో: విధి నిర్వహణలో ఉండగానే ఓ పంచాయతీ కార్మికుడు కిన్నెరసాని (Kinnerasani) వాగులో పడి మృతి చెందిన విషాద ఘటన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపాడు మండలం రాయపాడు (Rayapadu) గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపాడు గ్రామానికి చెందిన తుమ్మ రాంబాబు (33) గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం విధి నిర్వహణలో భాగంగా కిన్నెరసాని వాగు వైపు వెళ్లిన రాంబాబు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, సహచరులు ఆందోళనకు గురయ్యారు. గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.
ఆదివారం ఉదయం నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా, కిన్నెరసాని (Kinnerasani) వాగులో రాంబాబు మృతదేహం లభ్యమైంది. అతడికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మృతికి గల ఖచ్చితమైన కారణాలు అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి. రాంబాబు అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుని, తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Also Read : రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ.. రేవంత్‌పై ఫైర్!
Follow Us On: Instagram

