కలం, వనపర్తి: దివ్యాంగులు సమాజంలో సమాన భాగస్వాములుగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు విద్య, ఉపాధి, పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి (MLA Megha Reddy) అన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన దివ్యాంగుల పునరావాస, మనోవికాస కేంద్రం (నెయిబర్హుడ్ సెంటర్–ఎన్హెచ్సీ)ను ఎమ్మెల్యే శుక్రవారం ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమాన్ని దాతృత్వంగా కాకుండా హక్కుగా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
దివ్యాంగులు సమాజంలో సమాన భాగస్వాములుగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు విద్య, ఉపాధి, పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు పునరావాస సేవలు, మనోవికాస శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
దివ్యాంగులకు సామాజిక భద్రతా పెన్షన్లు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు వంటి ఉచిత సహాయక ఉపకరణాలు, విద్యా ప్రోత్సాహకాలు, స్వయం ఉపాధి రుణాలు, ప్రత్యేక పునరావాస కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల పట్ల సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం కమిటీ అధ్యక్షురాలు నవనీత క్యామరాజు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

