కలం, వనపర్తి: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) హెచ్చరించారు. శుక్రవారం పెద్దమందడి రైతు వేదికలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరైనా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. మహిళా సంఘాల రుణాల మంజూరులో జాప్యంపై ఏపీఎంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డులు..
వనపర్తి నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ప్రస్తుతం మరో రూ.40 కోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని, నిర్లక్ష్యం వహించే గ్రామపంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. సమావేశంలో మార్కెట్ యార్డు అధ్యక్షురాలు నవనీత, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి విజయభాస్కర్, జడ్పీ సీఈవో యాదయ్య, ఎంపీడీవో పరిణత, ఎంఈవో మంజుల తదితరులు పాల్గొన్నారు.

