పసిడి పూసి మాయచేసి.. బంగారం పేరుతో బ్యాంకుకే బురిడీ..!

​కలం, ఖమ్మం బ్యూరో : రాగితో తయారు చేసిన ఆభరణాలకు విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో నాణ్యమైన బంగారు పూత పూయించి, అసలైనవిగా నమ్మించి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు కేంద్రాలను లక్షల్లో ముంచేస్తున్న ఘరానా ముఠా గుట్టును కారేపల్లి పోలీసులు రట్టు చేశారు. కారేపల్లి (Karepalli) ఎస్సై బైరు గోపి నేతృత్వంలోని పోలీస్ బృందం పక్కా సమాచారంతో ఈ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సింగరేణి సర్కిల్ ఇన్స్పెక్టర్ నూనావత్ సాగర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

​పోలీసు దర్యాప్తులో వెలుగు చూసిన వివరాల ప్రకారం… నిందితులు తొలుత రాగితో వివిధ రకాల నకిలీ ఆభరణాలను తయారు చేయించి, వాటిపై చూసేందుకు అసలైన బంగారమేమో అని భ్రమపడేలా మెరిసే పసిడి పూత పూయించేవారు. అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడంతో పాటు ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించేవారు.

​ఈ క్రమంలోనే నిందితుడు ముందాడా రాంచందర్ తన ఏజెంట్ అయిన గుగులోత్ సునీల్ కుమార్‌తో కలిసి ఇల్లందులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో 52 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.3.90 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ నకిలీ బంగారాన్ని విడిపించేందుకు పక్కా ప్రణాళిక రచించి హైదరాబాద్‌కు చెందిన “మన గోల్డ్” కంపెనీని సంప్రదించారు. సదరు కంపెనీ ప్రతినిధి ద్వారా రూ.5.80 లక్షలు ఇప్పించి, ఆ డబ్బును సునీల్ తీసుకొని మోసం చేసి పరారయ్యాడు. ఈ బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన కారేపల్లి పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.

​ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు కారేపల్లిలోని భాగ్యనగర్‌కు చెందిన గుగులోత్ సునీల్ కుమార్, కారేపల్లికి చెందిన ముందాడా రాంచందర్‌లుగా పోలీసులు గుర్తించారు. సూర్యతండాకు చెందిన దారవత్ రాకేష్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి అక్రమంగా సంపాదించిన తెలుపు రంగు వెర్నా కారు రూ. 15 వేల నగదు, అలాగే నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించుకోవాలి : సిఐ

​ఈ సందర్భంగా సిఐ సాగర్ మాట్లాడుతూ… ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రజలు, బ్యాంకర్లు బంగారం తాకట్టు పెట్టే ముందు లేదా కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాల స్వచ్ఛతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, ఈ ముఠా చేతిలో ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా వచ్చి పోలీసులను సంప్రదించవచ్చని కోరారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన విచారణ అధికారి కారేపల్లి ఎస్సై గోపి, సమర్థవంతంగా సహకరించిన కామేపల్లి ఎస్సై శ్రీకాంత్‌లను సిఐ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>