ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి: సీపీఐ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ లో సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర ఏఐటీయూసి నాలుగవ మహాసభలను (AITUC 4th State Conference) విజయవంతం చేయడానికి కార్మిక లోకం కరీంనగర్ లో కదం తొక్కాలని సీపీఐ (Karimnagar CPI) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్ లోని రైల్వే స్టేషన్ వద్ద గల కార్మికుల విశ్రాంతి కార్యాలయం ఆవరణలో ఏఐటీయూసీ అధ్యక్షులు కాశెట్టి లక్ష్మణ్ అధ్యక్షతన హమాలీ కార్మికుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) మాట్లాడుతూ.. ఏఐటీయూసీ అంటేనే దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఆశా జ్యోతిగా నిలుస్తుందని,స్వాతంత్య్రానికి పూర్వం ఆవిర్భవించిందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామిగా ఏఐటీయూసీ అయిందని, ఆనాటి నుండే కార్మిక హక్కుల కోసం, వేతనాల పెంపు కోసం,శ్రమకు తగ్గ ఫలితం కోసం, సంఘటిత, అసంఘటిత రంగాలతోపాటు పెట్టుబడిదారుల చేతుల్లో దోపిడీకి గురవుతున్న కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమించిందని చెప్పారు. న్నో పోరాటాల మూలంగా అనేక చట్టాలు, హక్కులను కాపాడుకుంటూ వచ్చిందన్నారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 80 ఏళ్ళు కావస్తున్నా కార్మికుల బ్రతుకులు మారడం లేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను హరిస్తుందని దుయ్యబట్టారు. చెమటోడ్చి శ్రమను నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల బ్రతుకులు బుగ్గిపాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు. దాన్ని తిప్పికొట్టాలంటే కార్మికులు ఏకం కావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఉందని, నాటి నుండి నేటి వరకు కార్మికుల ప్రతీ కష్టంలో అండగా నిలబడేది ఒక్క ఏఐటీయూసి మాత్రమేనని పేర్కొన్నారు. కార్మిక ఉద్యమాలకు నిలయమైన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికునిపై ఉందని చెప్పారు. అందుకు మహాసభలకు కార్మికులు అండగా ఉండాలని, కార్మికులకు ఏఐటీయూసీ అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని వెంకటరెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, రైల్వే హమాలీ సంఘం అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మయ్య, గాండ్ల రమేష్ ఉపాధ్యక్షులు, నాయకులు జంగ శంకర్, రఘుపతి, నగేష్ , హమాలి కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>