కలం, స్పోర్ట్స్ : భారత హాకీ జట్టు కొత్త జెర్సీపై నెలకొన్న వివాదానికి హాకీ ఇండియా (Hockey India) తెరదించింది. సంప్రదాయ నీలం జెర్సీ స్థానంలో కాషాయ రంగును ఎందుకు తీసుకొచ్చారనే అంశంపై గురువారం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఈ మార్పు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, పూర్తిగా సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.వచ్చే నెల నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరగనున్న 2026 హాకీ ప్రపంచకప్ (Hockey World Cup 2026) కోసం భారత పురుషులు, మహిళల జట్లకు కాషాయ రంగు జెర్సీలను ఖరారు చేశారు. ఈ విషయాన్ని జూలై 27న హాకీ ఇండియా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే సంప్రదాయ నీలం జెర్సీని మార్చడంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్క్వినా సహా పలువురు మాజీ ఆటగాళ్లు, అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జట్టు గుర్తింపు, వారసత్వాన్ని కాపాడాలని వారు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో స్పందించిన హాకీ ఇండియా.. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ మ్యాచ్లు ఎక్కువగా నీలం రంగు సింథటిక్ టర్ఫ్లపై జరుగుతున్నాయని తెలిపింది. అదే రంగులో జెర్సీలు ఉండటంతో ఆటగాళ్లు మైదానంలో స్పష్టంగా కనిపించడం లేదని, పాసింగ్, విజన్ వంటి అంశాలపై ప్రభావం పడుతోందని వివరించింది. ఈ సమస్యను అధిగమించేందుకు కోచ్లు, ఆటగాళ్లతో చర్చించిన తర్వాతే కొత్త జెర్సీ రంగును ఎంపిక చేసినట్లు తెలిపింది. పసుపు, కాషాయ రంగులను పరిశీలించిన అనంతరం జాతీయ జెండాలోని కాషాయ రంగును ఎంచుకున్నామని వెల్లడించింది. ఈ రంగు ధైర్యం, త్యాగం, జాతీయ గర్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. ఇంతకుముందు కూడా భారత హాకీ జట్టు 2014 ప్రపంచకప్లో పసుపు, 2018 ప్రపంచకప్లో స్కై బ్లూ రంగు జెర్సీలను ఉపయోగించిందని హాకీ ఇండియా గుర్తుచేసింది. జెర్సీ రంగు కంటే ఆటగాళ్ల ప్రదర్శనే ముఖ్యమని, సాంకేతిక అవసరాల కోసమే ఈ మార్పు చేశామని స్పష్టం చేసింది.

